యాదాద్రి క్షేత్రం పునరావిష్కారణకు సిద్ధం..

94
- Advertisement -

రానున్న సహస్రాబ్ది కాలం చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా పునర్నిర్మితమైన తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి పంచనారసింహ క్షేత్రం పునరావిష్కారానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. బాలాలయంలో నిర్వహించే ఈ క్రతువుతోపాటు, పారాయణాల నిర్వహణకు దేశంలోని వివిధ క్షేత్రాల నుంచి వేదపండితులు, రుత్విక్కులు యాదాద్రికి చేరుకొన్నారు. యాగనిర్వహణకు బాలాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయంలో శుద్ధి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

మహాయాగానికి ఏర్పాట్లు పూర్తి..
యాదాద్రి ప్రధానాలయంతోపాటు దివ్య విమానం, ప్రతిష్ఠామూర్తులు, కలశాలు, శ్రీ సుదర్శన చక్రం సహా ఉపాలయాల సంప్రోక్షణకు తొలుత విశ్వశాంతి, జగత్‌ కల్యాణార్థమై యాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు పాంచరాత్ర ఆగమం ప్రకారం పంచకుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగశాలలో తూర్పున చతురస్రాకారం, దక్షిణాన ధనుస్సు, పడమరన వృత్తాకారం, ఉత్తరాన త్రికోణాకారం, ఈశాన్యంలో పద్మ కుండం ఏర్పాటుచేశారు. మధ్యలో స్వామివారి కవచమూర్తులను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. నలువైపులా ప్రవేశ ద్వారాలను, దర్పణాలను ఏర్పాటు చేశారు. సోమవారం నారసింహుడి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా పంచకుండాత్మక మహాయాగాన్ని ప్రారంభిస్తున్నారు. సోమవారం సప్తాహ్నిక దీక్షతో మహాయాగ పర్వాలు మొదలవుతాయి.

వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి..
యాదాద్రిలో కార్యక్రమాలు సజావుగా సాగడానికి పోలీస్‌, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరాకు ట్రాన్స్‌కో చర్యలు తీసుకొన్నది. ఆదివారం ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యులకు ప్రొటోకాల్‌ అమలు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, ప్రధానాలయంలో క్యూ కాంప్లెక్స్‌ వద్ద తనిఖీలు, పోలీసు భద్రత తదితర అంశాలను సమీక్షించారు. రెండు వేల మందితో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఈ నెల 29 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కొండపైకి చేరవేయడానికి ఈ నెల 25 నుంచి 75 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి భక్తుడికీ జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించే రోజుల్లో కొండ కింద భక్తుల కోసం ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు దేవాలయం తరఫున అన్న ప్రసాదాన్ని అందిస్తారు.

నేడు గండి చెరువుకు నీటి విడుదల..
స్వామి వారి తెప్పోత్సవం జరిపే గండి చెరువుకు మల్లన్న సాగర్‌ నుంచి శనివారం గోదావరి జలాలను విడుదల చేయగా.. ఆదివారం నాటికి యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి వరకు చేరాయి. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గండి చెరువులోకి లాంఛనంగా నీటిని విడుదల చేస్తారు. స్వామి కైంకర్యాల కోసం కొండపైన నిర్మించిన విష్ణు పుష్కరిణికి, కొండ కింద భక్తులు స్నానమాచరించేందుకు నిర్మించిన కృష్ణా పుష్కరిణి, కల్యాణ కట్టలకు గండి చెరువు నుంచే నీటిని అందిస్తారు. ఈ నెల 25న శివాలయాన్ని, 28న కొండ కింద గల కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపాలను ప్రారంభిస్తారు.

తొలి రోజు పూజలు..
ఉదయం 9 గంటల నుంచి స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండజ్యోతి ప్రజ్వలన, వాస్తుపూజ, హోమం, పర్వగ్నకరణం. సాయంత్రం 6 గంటలనుంచి మృత్స్యంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన.

28న స్వయంభువుల దర్శనం..
యాగం చివరి రోజున శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రం (శ్రవణం) నాడు ఉదయం 11.55 గంటలకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వయంభువుల దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. మహా పూర్ణాహుతి అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయాత్రతో ప్రధానాలయంలోకి తీసుకొస్తారు. ఆలయ గోపురాలకు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం కలశాలను బిగించి, ప్రధానాలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తారు. సీఎం కేసీఆర్‌ మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని స్వయంభువులను దర్శించుకొంటారు. యాగం సందర్భంగా బాలాలయంలో నిత్యం నిర్వహించే సుదర్శన హోమం, కల్యాణం, ఆర్జిత సేవలను నిలిపివేసి, ఈ నెల 17 నుంచి పాతగుట్ట ఆలయంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యథావిధిగా బాలాలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతాయి.

- Advertisement -