హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు..

181
World Telugu Conference
- Advertisement -

వచ్చే నెల 2నుండి 10 వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాష అభిమానులు, పండితులు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఈ మహాసభలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని ప్రకటించారు. తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు సంగీత – నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, జానపద అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు.

చక్కటి తెలుగుభాష, చక్కటి కవిత్వం తెలంగాణలో ఉందని, తెలంగాణ సాహితీ ప్రాభవం ప్రపంచానికి చాటేందుకు ఈ అకాడమీలు వేదికలు కావాలని సిఎం అన్నారు.
తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రముఖ సాహితీ వేత్తలు నందిని సిధారెడ్డి, వఝుల శివకుమార్, సిపిఆర్ఓ వనం జ్వాలా నర్సింహారావు, సిఎం ఓ.ఎస్.డి.  దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

యావత్ ప్రపంచం గుర్తించే విధంగా, చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా సభలు నిర్వహించాలని సిఎం ఆదేశించారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటే విధంగా హైదరాబాద్ లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఈ మహాసభలకు దేశ, విదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులను , తెలుగు భాష అభిమానులను ఆహ్వానించాలని సిఎం పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా అవదానాలు, కవి సమ్మేళనాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులు నిర్వహించాలని, తెలంగాణ కవుల అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలని సిఎం చెప్పారు.

- Advertisement -