దాదాపు మూడు లక్షల సంవత్సరాల క్రితం టాంజానియా దేశంలో లూసీ అనే మహిళ ప్రసవించిన పిల్లల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి వ్యాప్తి చెందిందని పరిశోధనల ద్వారా తెలుస్తోందని, ఈ రకంగా మానవ నాగరికతకు మహిళ బీజాలు వేసిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గురువారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఆదిదేవత మహిళ అన్నారు. చాలా గ్రామాల్లో గ్రామదేవతలు మహిళలని తెలియజేశారు. చరిత్రలో చాలామంది రాణులు చక్కటి రాజ్యపాలన చేశారని, ఆధునిక కాలంలో శ్రీమతి సిరిమావో బండారు నాయకే, శ్రీమతి ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ లాంటి మహిళామణులు దేశ ప్రధానులుగా తమదైన ముద్ర వేశారని చెప్పారు. వేద కాలంలో గార్గి, మైత్రేయి లాంటివారు జ్ఞానానికి మారుపేరుగా నిలిచారని వివరించారు. భారతీయ సమాజం మొదట్లో మాతృస్వామిక వ్యవస్థగా ఉండేదని, క్రమంగా పితృస్వామిక వ్యవస్థగా మారిందని చెప్పారు. వర్తమాన సమాజంలో మహిళలు ఆయా రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. పురుషాధిక్య సమాజంలో ఉన్న మహిళలు జ్ఞానానికి మరింత పదును పెట్టాలని, ఇందుకోసం పాఠ్యపుస్తకాలతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని అందించే ఇతర పుస్తకాలను అధ్యయనం చేయాలని కోరారు.
టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ మనకు మొదటి దైవం తల్లి అన్నారు. హైందవ సనాతన సంస్కృతిలో మహిళకు విశేషమైన స్థానం ఉందని చెప్పారు. టీటీడీ ఉద్యోగినులు తమ ఇంటిని చక్కబెట్టుకున్న విధంగానే, సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయడానికి కృషి చేయాలని కోరారు. టీటీడీ కళాశాలల అధ్యాపకులు మరింత శ్రద్ధతో పనిచేసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. కళాశాల విద్యార్థులు చక్కగా చదువుకొని టీటీడీకి మంచి పేరు తీసుకురావాలని, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరారు.
Also Read:IPL 2024 :వారంతా రీఎంట్రీ ఇస్తారా?