మహిళా సంఘాలతో రేషన్‌ పంపిణీ..

299
- Advertisement -

జులై ఒకటవ తేదీ నుండి రేషన్‌ డీలర్ల సమ్మె నేపథ్యంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి అవసరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది. సమ్మె పేరుతో రేషన్‌ డీలర్లు పేదల ఆహార భద్రతకు ఆటంకం కలిగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిర్దేశిత గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్‌ఓ (రిలీజ్‌ ఆర్డర్‌) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి, ఆ తరువాత సస్పెన్షన్‌ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్ణయించింది.

రేషన్‌ డీలర్లను తొలగించి వారి స్థానంలో జూలై 5వ తేదీ నుండి మహిళా సంఘాల ద్వారా సరుకుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో పేదలకు సకాలంలో సరుకులు అందించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో బాగంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఎంసీహెచ్‌ఆర్‌డీ లో గురువారంనాడు జాయింట్‌ కలెక్టర్లు, డీసీఎస్‌వోలు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘంగా సమీక్షి నిర్వహించారు. జూలై 5 నుండి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీ చేయాలని, స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే గడువు పొడిగించాలని కమిషనర్ అకున్ సబర్వాల్ సూచించారు.

Women to replace default ration dealers

తెలంగాణ ప్రభుత్వం పేదల ఆహార భద్రత కోసం కిలో రూపాయి చొప్పున ప్రతి నెల 2 కోట్ల 75 లక్షల మందికి రేషన్‌ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తోంది. ఈ బియ్యాన్ని లబ్ధిదారులకు అందిచాల్సిన కనీస బాధ్యత డీలర్లపై ఉంది. కానీ డీలర్లు ఆ బాధ్యతను విస్మరించడం బాధాకరమని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెను విరమించాలని రేషన్‌ డీలర్లకు అనేకసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది అయినా కూడా వారి వైఖరిలో మార్పురాలేదన్నారు. దీంతో, పేదలకు ఇబ్బంది కలగకుండా మహిళా సంఘాలు, అందుబాటులో ఉన్న దగ్గర ఎన్‌ఆర్‌ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీని చేయాలని నిర్ణయించామని తెలిపారు.

జిల్లా, మండల, గ్రామ రేషన్‌ షాపుల వారీగా మహిళా సంఘాలను గుర్తించడంలో పారదర్శక విధానాన్ని పాటించాలని అకున్ సబర్వాల్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు సరుకుల పంపిణీని పర్యవేక్షిస్తారని, రికార్డుల నిర్వాహణ కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నారు. డీలర్‌షిప్‌ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జూలై 1వ తేదీన మీ సేవ కేంద్రాల్లో అధికారులు డీడీల కట్టించాలని కోరారు.

Women to replace default ration dealers

సరుకుల పంపిణీ కంటే ముందు ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, పంపిణీ కోసం లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ, ఐకేపీ, కమ్యూనిటీ హాల్స్‌, యూత్‌ బిల్టింగ్‌లను గుర్తించాలని కమిషనర్ అకున్ సబర్వాల్ కోరారు. వేయింగ్‌ మెషిన్లను సమకూర్చుకోవాలని, ఈ విషయంలో తూనికలు-కొలతల శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ గోదాముల నుండి సరుకులను తరలించాలని అకున్ సబర్వాల్ చెప్పారు. ఇందుకోసం రవాణ వాహనాలను, సరుకుల లోడింగ్‌ కోసం హమాలీలను సిద్ధం చేసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

జిల్లా, మండల, గ్రామస్థాయిలో పౌరసరఫరాలు, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో రేషన్‌ సరుకులు ఎక్కడ నుంచి పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని లబ్ధిదారులకు ముందుగానే సమాచారాన్ని అందజేయాలని చెప్పారు.

Women to replace default ration dealers

సమస్యలు, ఫిర్యాదులు, సమన్వయం కోసం 24 గంటలు పనిచేసేలా రాష్ట్రస్థాయిలో పౌర సరఫరాల కేంద్ర కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నట్టు అకున్ సబర్వాల్ వెల్లడించారు. 1967 టోల్‌ఫ్రీ నెంబర్‌, వాట్సప్‌ నెంబర్‌ 7330774444 అందుబాటులో ఉంచామన్నారు. క్షేత్రస్థాయిలో సరుకుల పంపిణీపై నిత్యం పర్యవేక్షణతో పాటు రికార్డుల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పారు.

మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేషన్‌ పంపిణీలో జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ డివిజన్‌ స్థాయిలో ఆర్‌డిఓ, మండల స్థాయిలో తహసీల్దార్‌, గ్రామ స్థాయిలో వీఆర్‌ఓలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

- Advertisement -