మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్…నెలసరి (పీరియడ్స్) రోజుల్లో మహిళా ఉద్యోగులు పనిప్రదేశాల్లో ఎదుర్కొనే ఇబ్బందులపై పలు కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది.
కేరళ రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థ అయిన మాతృభూమి టీవీ న్యూస్ చానల్ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళలకు రుతుస్రావం మొదటిరోజు లేదా రెండో రోజు అదనంగా సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ ఎంవీ శ్రేమ్యాస్ కుమార్ తెలిపారు.
ఇటీవల ముంబైలోని ఓ డిజిటల్ మీడియా కంపెనీ సైతం మహిళలకు ఎఫ్‌వోపీ సెలవు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా మహిళలకు ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ (ఎఫ్‌వోపీ) రోజు సెలవు ఇవ్వాలంటూ ఇటీవల ఆన్‌లైన్లో ఓ పిటిషన్ దాఖలైంది. వారం రోజుల్లోనే 26 వేలమంది దీనిపై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ముందుకొచ్చి మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుల్లో సెలవులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పీరియడ్స్ రోజుల్లో మహిళలకు సెలవులు ఇచ్చేవిధంగా ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.