తెలంగాణ మహిళలకు ఎక్కడ వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేస్తారని,ఎందుకంటే మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్‌లో ట్రూ కాలర్ మరియు నెట్వర్క్ 18 ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక మాధ్యమాల్లో మహిళలు వేధింపులపై గళమెత్తడం అనే అంశంపై జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా ప్రముఖ జర్నలిస్ట్,సీనియర్ పొలిటికల్ ఎడిటర్ మార్యా షకీల్ వ్యవహరించారు.
మహిళల రక్షణతో పాటు, ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్,డబుల్ బెడ్ రూం ఇండ్ల లాంటి అనేక పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వారి పేరు మీదనే లబ్ధి చేకూరుస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.తెలంగాణలో ఇటీవల మహిళా జూనియర్ లైన్ మెన్ నియామకం అవడాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత,మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళలకు ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తే మహిళలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గ్రామాల్లో ఉపాధి కోసం బీడీలు చుడుతున్న మహిళలు,ల్యాప్‌టాప్‌లో పనిచేసే రోజులు రావాలన్నారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో షీ టీంలు ఏర్పాటు చేయటంతో పాటు మహిళా పోలీసు స్టేషన్లు,స్పెషల్ సైబర్ సెల్ సైతం ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.మహిళలపై సైబర్ వేధింపులకు ప్రత్యేక చట్టాలు ఉంటే,మరింత వేగంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మహిళలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైతే, వాటిని తొలగించకుండా,ఆధారాలతో వారి మీద ఫిర్యాదు చేయాలని,అప్పుడే తక్షణం కఠిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేయొద్దని,తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.