తన ప్రేమను కాదన్నందుకు ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ ఘాతకుడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ సంధ్య మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.
చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి.. వివాహమైనా ఇంట్లోనే ఉంటున్న అక్కలు.. తల్లితోపాటు తనపైనే పడిన కుటుంబ పోషణ భారం.. ఈ పరిస్థితుల మధ్య చిరుద్యోగంతో నెట్టుకొస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె శాంతినగర్ చౌరస్తాలోని లక్కీ ట్రేడర్స్ అనే అల్యూమినియం డోర్స్, విండోస్ తయారు చేసే సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది.
లాలాపేట్‌లోని ఈదమ్మగుడి ప్రాంతంలో సంధ్యారాణి స్నేహితురాలు నివసిస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే సంధ్యారాణికి స్నేహితురాలి సోదరుడు కార్తీక్(25)తో పరిచయమైంది. అయితే,కార్తీక్‌తో తన జీవితం మధ్యలోనే ముగుస్తుందని ఊహించలేదు. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు.అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా కార్తీక్ వేధింపులు ఆగలేదు.
దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సంధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ నరహంతకుడిలా మారాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికులు చేరుకునే లోపు అక్కడి నుంచి పరారై పోలీసులకు లొంగిపోయాడు.