తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై విధించిన ఆంక్షల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తే వాటిని ఫేక్ న్యూస్ కింద పరిగణించి జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సమాచార శాఖను ఆదేశించారు మోడీ.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సందర్భంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని సీఎం గుర్తు చేశారు.
జర్నలిస్ట్‌లకు ఇచ్చే అక్రిడేషన్ మార్గదర్శకాల్లో కేంద్ర సమాచార శాఖ కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జర్నలిస్ట్‌లు రాసే వార్తలు నకిలీవని తేలితే వాళ్లకు ఇచ్చిన అక్రెడిటేషన్‌ను రద్దు చేయడమే కాదు ఫిర్యాదుతో పాటు చర్యలు తీసుకునేలా మార్పులు చేసింది. అంతేగాదు విచారణ సమయంలో సదరు జర్నలిస్ట్ అక్రెడిటేషన్ సస్పెన్షన్‌లో ఉంటుంది. అది ఫేక్ న్యూసే అని తేలిస్తే.. తొలిసారి అయితే ఆరు నెలలు, రెండో సారి అయితే ఏడాది, మూడో సారి ఉల్లంఘిస్తే శాశ్వతంగా అక్రిడేషన్ రద్దు చేస్తామని సమాచార శాఖ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆదేశాలను వెనక్కితీసుకోవాలని ఆదేశించారు మోడీ.