పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ చీకటి అవుతుందన్నారు సీఎం కేసీఆర్. దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ దేవరకొండ కరువుతో నలిగిపోయిన ప్రాంతమన్నారు.సమైక్యపాలనలో అన్నిరంగాల్లో ఆగమైందన్నారు. ఆంధ్రా ముఖ్యమంత్రులకు మనకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదన్నారు.ఈ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు సైతం ఏమి చేయలేకపోయారని దుయ్యబట్టారు.
నాడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని భరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. నేడు అదే తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్,టీడీపీలకు బుద్దిచెప్పాలన్నారు. చంద్రబాబు తెలంగాణకు అవసరమా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన కేసీఆర్ ఆయన్ని భుజాలపై ఎందుకు మోస్తున్నారో చెప్పాలన్నారు.
దేవరకొండలో రవీంద్రకుమార్ గెలుపు ఖాయమన్నారు. టీఆర్ఎస్ విజయం దేవరకొండతోనే మొదలవుతుందన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వయంగా కలిసి విన్నవించానని..50 ఉత్తరాలు రాశానని కానీ స్పందన లేదన్నారు.
తెలంగాణలో ముస్లిం,గిరిజనుల రిజర్వేషన్లు సాధించి తీరుతానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రరాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు.కాంగ్రెస్,బీజేపీ దొందు దొందేనని తెలిపారు. ఒకరు కాషాయం జెండా మరొకరు మూడు రంగుల జెండాతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలిపారు. మా తండాలో మా రాజ్యం కావాలని లంబాడీలు కొట్లాడరని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటే అవుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లకు నీళ్లిచ్చే తెలివిలేదన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిందన్నారు.