వింటర్‌లో చర్మ సౌందర్యానికి చిట్కాలు!

49
- Advertisement -

చలికాలం రానే వచ్చింది. ఈ వింటర్ సీజన్ లో వచ్చే చర్మ సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చర్మం పొడిబారడం, పాదాలు, పెదవులు పగలడం, పగుళ్ళ మంటలు.. అబ్బో ఇలా చాలా సమస్యలే చుట్టూ మూడతాయి. ఈ సమస్యల నుంచి బయట పడడానికి మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్ లు, మార్చరైజర్స్ వాడుతూ ఉంటాము. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా సహజసిద్దంగా చర్మ సంరక్షణ కోసం మంచి చిట్కాలు ఉన్నాయి. అవి చలికాలంలో ఎంతో ఉపయోగపడతాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

చర్మం పొడిబారే సమస్య ఎక్కువగా ఉన్నవారు స్నానం చేసే ముందు కొద్దిగా బాదం నూనె ను శరీరానికి పట్టించుకొని.. పది లేదా పదిహేను నిమిషాల తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాదం నూనెలో ఉండే విటమిన్ డి ని శరీరం గ్రహించుకుంటుంది. తద్వారా చర్మం పొడిబారే సమస్య తగ్గి.. మృదువుగా, తేమగా, కాంతివంతంగా తయారవుతుంది. చర్మ సంరక్షణలో ఆలివ్ ఆయిల్ కూడా సమర్థవంతంగా పని చేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందువల్ల ఈ ఆయిల్ ను చర్మానికి పట్టించుకోవడం వల్ల దెబ్బతిన్న కణాలను తొలగించి స్కిన్ పొడిబారకుండా చేస్తుంది. అందువల్ల చర్మంపై ముడతలు, గీతాలు వంటివి రాకుండా ఉంటాయి. ఇంకా వృద్ధాప్య ఛాయలు కూడా దూరమౌతాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

ఇంకా చర్మసంరక్షణలో కొబ్బరి నూనె ఎంతో ప్రయోజనకారి. పూర్వం నుంచి కూడా కొబ్బరి నూనెను చలికాలంలో చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ముఖం, కాళ్ళు, చేతులకు రాసుకుని రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్ని లేచి చల్లని నీటితో లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చర్మం సున్నితంగా మారడం తో పాటు, కాంతివంతంగా తయారవుతుంది. ఇక తేనె కూడా చలికాలంలో చర్మానికి మంచి మార్చరైజర్ లా పని చేస్తుంది. తేనె లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు చలికాలంలో వచ్చే చర్మసమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి తేనెను నేరుగా చర్మానికి రాసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోతాయి.

Also Read:చేవెళ్లపై గులాబీ జెండా ఎగరాలి

- Advertisement -