రివ్యూ : విన్నర్

260
Winner Movie Review
- Advertisement -

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘విన్నర్’. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది విన్నర్‌. మరి ఈ సినిమాతో సాయిధరమ్‌ ఆకట్టుకున్నాడా..?సుప్రీం హీరోతో బుజ్జి కాంబినేషన్‌ సెట్ అయిందా లేదా చూద్దాం..

కథ:

ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో బయటికి వెళ్లిపోతాడు కోటిశ్వరుడైన మహేందర్ రెడ్డి(జగపతి బాబు). కోట్లాది ఆస్తిని వదులుకుని ప్రశాంతంగా భార్య,కొడుకుతో జీవిస్తుంటాడు. కట్ చేస్తే తన తండ్రి సమస్యల్లో ఉన్నాడని తెలుసుకుని ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో అనుకోని పరిస్ధితుల్లో జగపతి కొడుకు సిద్ధార్థ(సాయిధరమ్ తేజ్‌) తన కుటుంబానికి దూరమవుతాడు. 20 ఏళ్ల తర్వాత రామ్‌గా పేరు మార్చుకుని జర్నలిస్ట్‌గా ఏంట్రీ ఇస్తాడు. తొలిచూపులోనే సితార(రకుల్‌)ని చూసి ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. తర్వాత తన ప్రేమను దక్కించుకోవటానికి సిద్ధార్థ్ చేసిన ప్రయత్నాలేంటీ..? సిద్దార్ధ్‌ ఎవరనేది మహేందర్‌ రెడ్డికి ఎలా తెలుస్తుంది..?చివరికి కథ ఎలా సుఖాంతమవుతుంది అన్నదే విన్నర్ స్టోరీ.

Winner Movie Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌   కథ, నేపథ్యం , సాయిధరమ్ నటన, రకుల్ అందాలు,కామెడీ. చిరు మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌ తక్కువ టైంలోనే మాస్‌ హీరోగా మంచి క్రేజ్ సంపాదించాడు. తనదైన నటనతో సాయిధరమ్ అదరగొట్టాడు. యాక్షన్, డ్యాన్స్, డైలాగ్ డెలీవరీలో సూపర్ అనిపించుకున్నాడు. అథ్లెట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతంగా నటించింది. గ్లామర్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పృథ్వీ, జగపతి బాబు, వెన్నెల కిషోర్, థాకూర్ అనూప్ సింగ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా పృథ్వీ, వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది.  అనసూయ ఐటమ్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మైనస్ పాయింట్స్‌ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఊహ అందే కథనం, సెకండాఫ్‌, హీరోయిన్ పాత్ర పరిమితం కావడం,కథకు లింకులు లేకపోవడం.తెలుగు సినిమాకి అలవాటైన ఫార్ములా కథే ఇది.సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్టాఫ్‌ ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్‌ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. ఫస్టాఫ్‌ రేంజ్‌లో పండిన వినోదం సెకండాఫ్‌లో కూడా పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది. విలనిజం చెప్పుకోదగిన స్థాయిలో లేదు.

సాంకేతిక విభాగం:

టెక్నికల్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. అబ్బూరి రవి సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. దర్శకుడు తాను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించాడు. అయితే ద్వితీయార్ధంపై దృష్టి పెట్టాల్సింది.  విదేశాల్లో పాటలు, హార్స్‌ రేసింగ్‌ సన్నివేశాలు చక్కటి నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫర్వాలేదు. మ్యూజిక్ పరంగా తమన్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

తెలుగు సినిమాకి అలవాటైన ఫార్ములా కథే ఇది. కాకపోతే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నంతసేపూ ఇది మనం చూసేసిన కథే అనిపించకుండా, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం సరదాగా గడిచిపోయిందంటే చాలు.. పాసైపోయినట్టే.. ఆ విషయంలో కొంత వరకు సఫలమయ్యాడు . ఫస్టా ఫ్‌ కామెడీ, యాక్షన్ బేస్ చేసుకుని రన్ చేశారు. సాయి ధరమ్, రకుల్ నటన, కామెడీ సినిమాకు ప్లస్ కాగా ఊహకి అందే కథనం,సెకండాఫ్ మేజర్ మైనస్ పాయింట్స్. మొత్తంగా తండ్రీ,కొడుకుల బంధంతో నడిచే సాయిధరమ్ తేజ్ విన్నర్.

విడుదల తేదీ:24/02/2016
రేటింగ్:   3/5
నటీనటులు: సాయిధరమ్‌ తేజ్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్
సంగీతం: తమన్‌
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని

- Advertisement -