దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం- కేసీఆర్‌

154
kcr cm
- Advertisement -

తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించి, రానున్న కాలంలో 40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సిఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు సలహాలు అందించాలని, తనను కలిసి ధన్యవాదాలు తెలిపిన దళిత మేధావులను సిఎం కెసిఆర్ ఆహ్వానించారు.

సిఎం దళిత సాధికారత పథకాన్ని ప్రకటించి మొదటి దశలో 1200 కోట్ల రూపాయలను ప్రకటించినందుకు గాను, మరియమ్మ లాకప్ డెత్ విషయంలో తక్షణమే స్పందించి దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంచినందుకు గాను, దళిత మేధావులు ప్రొఫెసర్లు ప్రగతి భవన్‌లో సోమవారం సిఎం కెసిఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సిఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్పేర్ అసోసియేషన్ తదితర దళిత సంఘాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు మేధావులున్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ‘‘తెలంగాణ లోని ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నం. సాగునీటి రంగం, వ్యవసాయం రంగం సహా గ్రామీణ వ్యవస్థ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసుకున్నం. అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు పరిచుకుంటూ వస్తున్నం. తద్వారా అందరి జీవితాలతో పాటు దళితుల జీవితాలు కూడా మెరుగుపడుతూ వస్తున్నాయి. అయినా కూడా, దళితుల కోసం ఇంకా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సామాజికంగా, ఆర్ధికంగా శతాబ్దాల కాలంగా వివక్షకు గురవుతూ వస్తున్న దళిత సమాజం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాగుచేసుకోవాల్సిన అవసరమున్నది. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో పేదరికం అనేదే లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాడానికి రానున్న కాలంలో ఈ పథకం ద్వారా 40 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేయబోతున్నం. దీనికి తోడుగా భవిష్యత్తులో కార్పస్ఫండ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నం. మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్దిదారునికే ఆర్ధిక సాయం అందించాలని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నం. ఈ నేపధ్యంలో దళిత మేధావి వర్గంగా ప్రొఫెసర్లుగా ఉన్నత విద్యావంతులుగా ఉద్యోగులుగా అందరూ ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలి. దళిత సమాజాంలో ఏం జరుగుతున్నది ? ఇంకా ఏమి చేయాలి ? ఎట్ల చేస్తే అట్టడుగున ఉన్న కడు పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చో.. మీ సలహా సూచనలను అందించండి. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా డేలాంగ్ వర్క్ షాప్ ను నిర్వహించుకుందాం, దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం ’’ అని సిఎం కెసిఆర్ దళిత మేధావులకు తెలిపారు.

దళితుల సామాజిక ఆర్ధిక సమస్యలను దేనికదిగా లోతుగా విశ్లేషించి, కేటగిరీల వారిగా సమస్యలను విభజించి వారికి సిఎం దళిత సాధికారత పథకం ద్వారా సాయం అందించే కార్యాచరణ చేపట్టబోతున్నామని సిఎం తెలిపారు. పథకాన్ని రూపొందించడమే కాకుండా దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి కావాల్సిన సపోర్టివ్ మెకానిజాన్ని మనమే తయారు చేసుకోవాలని సిఎం అన్నారు. ఏరంగంలోనైనా అభివృద్ధి జరగాలంటే అందుకోసం రెండు రకాల ఇన్ పుట్స్ అవసరమని తెలిపారు. అందులో వొకటి ఆర్ధిక పరమైనది కాగా రెండోది ఆలోచన పరమైనదని, రెండూ ఇన్ పుట్స్ ను కలెగలిపి దళితుల అభివృద్ధి కోసం సమష్టి కృషిని సాగిద్దామని సిఎం దళిత మేధావులకు వివరించారు.

‘‘దళితుల సమస్యలు వొక్కతీరుగా లేవనీ.. వారి జీవన పరిస్థితులను బట్టి, గ్రామాల్లో వొక రకంగా పట్టణాల్లో మరో రకంగా వున్నాయి. సెమీ అర్భన్ లో వొక తీరు సమస్యలుంటే కార్పోరేషన్ స్థాయిలో మరో తీరుగా వున్నయి. హైద్రాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లోనయితే పూర్తి భిన్నంగా దళితుల సమస్యలున్నయి. వీటిని మేధావులుగా అర్థం చేసుకొని, ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏ విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా శాశ్వత పరిష్కారాలను సాధించగలమో ఆలోచన చేయాల్సిన అవసరమున్నది. తద్వారా దళిత సాధికారత పథకాన్ని అమలు చేసుకొని తద్వారా కష్టాలను అధిగమించి, ఫలితాలను ఏవిధంగా సాధించగలమో కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరమున్నది.’’ అని సిఎం అన్నారు.

ఈ పథకాన్ని పటిష్టంగా రూపకల్పన చేయడం ద్వారానే సగం విజయం సాధించినట్లవుతుందని, చేసి ఆశించిన ఫలితాలను రాబట్టే క్రమంలో ఈ పథకాన్ని పటిష్టంగా రూపకల్పన చేయడమే ప్రధానమని సిఎం అన్నారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులతో పదిన్నర గంటల పాటు చర్చ జరిగిందని, ఆ చర్చలో అనేక సలహాలు సూచనలను వారు అందించారన్నారని సిఎం తెలిపారు. ఇంకాకూడా వివిధ వర్గాలతో మరికొన్ని సమావేశాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అందుకు దళిత మేధావి వర్గం తమవంతు పాత్రను పోషించాలన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు :
తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేంచేందుకు సిఎం కెసిఆర్ ప్రకటించిన ‘సిఎం దళిత సాధికారత పథకం’.. దళితుల పాలిట వరమని, వారి జీవితాల్లో ఈ పథకం, విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనున్నదని దళిత మేధావులు స్పష్టం చేశారు. అందుకు సిఎం కెసిఆర్ కు వారు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో సిఎం ను కలిసి ధన్యవాదాలు తెలిపిన సందర్భంగా వారు భాగోద్వేగంతో స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక భారాన్ని లెక్కచేయకుండా, అణగారిన తమ జాతి అభివృద్ధి కోసం, కమిట్ మెంట్ తో ఉదార స్వభావంతో సిఎం కెసిఆర్ కంకణం కట్టుకోవడం హర్షనీయమని, ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం తెలంగాణ శాఖ నేతలు తెలిపారు. అదే సందర్భంలో.. ఇటీవల మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సిఎం కెసిఆర్ తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని నిలబెట్టడం తోపాటు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మరియమ్మ చావుకు కారణమైన పోలీసులను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయడం తోపాటు నేరం నిరూరపణయితే ఉద్యోగం లోంచి శాశ్వతంగా తొలగిస్తామనడం, గొప్ప విషయమన్నారు. సిఎం చర్య ద్వారా దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు. నేడు ప్రత్యేకంగా డిఎస్పీని బాధితులను పరామర్శిచడానికి పంపించడం తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టయిందన్నారు.. అందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నమన్నారు. అదే సందర్భంలో సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకం అమలులో వర్కుషాపు నిర్వహించి, దళిత మేధావి వర్గాన్ని ఆహ్వానించడాన్ని అభినందిస్తున్నామని అందుకు కూడా సిఎం కెసిఆర్ కు కృతజ్జతలు తెలుపుతున్నామని దళిత మేధావులు అన్నారు.

సిఎం కెసిఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వారిలో… ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ మురళీదర్శన్, ఓయు ప్రొఫెసర్ మల్లేశం, మాదిగ విద్యావంతుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉస్మానియా యూనిర్శిటీ ఎస్సీ ఎస్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి కుమార్, బంధు సొసైటీ అధ్యక్షుడు పుల్లెల వీరస్వామి, మాదిగ విద్యావంతుల వేదిక అధ్యక్షులు డా. జాన్, ఓయూ ఫ్రొఫెసర్ మల్లేశం, సి.బి. ప్రసాద్, బి. కుమార్, నాగరాజు, జాన్ సుందర్ రాజ్, శ్రీమతి వాణి, శ్రీమతి మెర్సీ, డాక్టర్ సుందర్ రావు, ఎ. సుధార్త్, రాజేందర్, డాక్టర్ ప్రీతమ్, కె. కృష్ణ, డాక్టర్ తిరుపతి, డాక్టర్ మల్లికార్జున్, రాజేందర్, డాక్టర్ చంద్రయ్య, డాక్టర్ వంశీ, జి. రమేష్ బాబు తదితరులున్నారు.

- Advertisement -