గత కొద్దికాలంగా టీ కాంగ్రెస్ టైం అసలు బాగాలేదు. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడు మరో గట్టి దెబ్బ తగలనుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుండి పలువురు నేతలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుండి ఆత్రం సక్కు, రేగ కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబితా భేటీ అయినట్లు తెలుస్తోంది. వీరి భేటీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వారిమధ్య మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఈ సమావేశం ఒవైసీ ఇంట్లోనే జరిగిందని, సబితా కుమారుడు కార్తిక్ రెడ్డితో పాటు ప్రధాన అనుచరులంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై సబిత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకే గులాబి పార్టీలో చేరడానికి ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేపథ్యంలో సబిత రాజీనామా కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.