టీమ్‌ఇండియాను అత్యంత విజయవంతంగా నడిపించిన జోడీ.. కెప్టెన్ కోహ్లి, కోచ్ కుంబ్లేల మధ్య తీవ్ర స్థాయి విభేదాలు ఎవరూ వూహించని పరిణామమే. అంతా సర్దుకుంది అనుకుంటుండగానే కుంబ్లే రాజీనామా క్రికెట్ అభిమానులకు షాక్‌ని మిగిల్చింది. కుంబ్లే వైదొలిగిన వార్త తెలుసుకున్న ఎందరో మాజీ ఆటగాళ్లు, అభిమానులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలిపారు.
ప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఆ తర్వాత స్వల్ప విరామం తర్వాత శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. లంక పర్యటనకు ముందే కోచ్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ సీనియర్ బోర్డు సభ్యుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ నేపథ్యంలో కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్పందించిన సెహ్వాగ్ కోచ్‌గా కుంబ్లే స్ధానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని తెలిపారు. కోచ్ బాధ్యతలు నిర్వహించిన ఏడాది కాలంలోనే టీమిండియా వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌లు గెలిచింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కోచ్‌గా అతను సాధించిన విజయాలను అంత తక్కువ సమయంలో మరొకరు అందుకోవడం కష్టం. అతని కోచింగ్ శైలిపై ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఏ ఇతర సీనియర్, ఆటగాడైనా అతని కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విజయం సాధించలేరు అని సెహ్వాగ్ తెలిపాడు. భారత జట్టుకు విదేశీ కోచ్ కంటే స్వదేశీ కోచ్ అయితేనే జట్టుకు మంచిదని సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
కుంబ్లే, కోహ్లిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. పలు సందర్భాల్లో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేసిన వారిద్దరు మాట్లాడుకోకపోవడంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ‘‘కోహ్లి, కుంబ్లే మాట్లాడుకోవట్లేదు. కొన్ని సమస్యలున్నాయని తెలుసు. కానీ ఆరునెలలుగా మాట్లాడుకోవట్లేదని తెలిసి దిగ్భ్రాంతి చెందామని బీసీసీఐ అధికారి వివరించారు.