ఆదివారం సెలవు ఎందుకో తెలుసా?

8
- Advertisement -

దేశంలో అందరికి సెలవు అనగానే గుర్తుకొచ్చేది ఆదివారం. అయితే ఆదివారమే ఎందుకు సెలవు అనేది చాలామందికి తెలియదు. ఆదివారం సెలవు కావడానికి ఓ చరిత్ర ఉంది.

భారతదేశంలో ఆదివారం ఎప్పటినుంచో సెలవుదినంగా లేదు. అది ఒక దీర్ఘకాల కార్మిక ఉద్యమ ఫలితం. 1890లో నారాయణ్ మెఘాజీ లోఖండే నాయకత్వంలో జరిగిన చారిత్రాత్మక పోరాటం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం వారానికి ఒకరోజు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఆదివారం విశ్రాంతి రోజు, కుటుంబంతో గడిపే రోజు, చిన్న పండుగలా భావిస్తాం. కానీ బ్రిటిష్ పాలన కాలంలో కార్మికులు వారానికి ఏడు రోజులు నిరంతరం పనిచేయాల్సి వచ్చేది. ముఖ్యంగా బొంబాయి (ప్రస్తుతం ముంబై)లోని టెక్స్టైల్ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎక్కువ గంటలు పని, విశ్రాంతి లేకపోవడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది.

ఈ నేపథ్యంలో లోఖండే ….కార్మికుల హక్కుల కోసం ఉద్యమం ప్రారంభించారు. 1881 నుంచి 1884 మధ్య ఆయన నిరసనలు నిర్వహించి, బ్రిటిష్ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించి, సుమారు 10,000 మంది కార్మికులను సమీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ ఉద్యమం కొనసాగి, చివరకు బ్రిటిష్ అధికారులు ఒప్పుకున్నారు.

1890 జూన్ 10న ఆదివారం అధికారికంగా వారాంత సెలవుగా ప్రకటించారు. ఇది భారత కార్మిక హక్కుల చరిత్రలో ఒక కీలక మైలురాయి. ఆదివారాన్ని సెలవుగా ఎంపిక చేయడానికి మతపరమైన కారణాలూ ఉన్నాయి. బ్రిటిష్ అధికారులు క్రైస్తవులు కావడంతో ఆదివారం వారికి ప్రార్థన దినం. అదే సమయంలో లోఖండే హిందూ సంప్రదాయాలను ప్రస్తావిస్తూ ఆదివారం సూర్యదేవుడికి సంబంధించిన పవిత్ర దినమని వాదించారు.

అయితే ఆదివారం విశ్రాంతి భావన 321 ఏ.డి.లో రోమన చక్రవర్తి కాన్స్టాంటైన్ ప్రకటించిన నిర్ణయంతో ప్రారంభమైంది. తర్వాత అది యూరప్‌లో వ్యాపించి, బ్రిటిష్ పాలన ద్వారా భారత్‌కు వచ్చింది. ఈరోజు సాధారణంగా కనిపించే ఆదివారం సెలవు, ఒకప్పుడు కఠిన పోరాటంతో సాధించిన హక్కు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

- Advertisement -