అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షడెవరో తేలిపోయింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనా లేక రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంపా? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుందంటూ ప్రపంచ దేశాలు లాభనష్టాలను బేరీజువేసుకున్నాయి. ఇక సర్వేలు ట్రంప్నకు షాక్ తప్పదంటూ.. . హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయంటూ మీడియా సంస్థలు తెగ హడావిడి చేశాయి. కానీ ఫలితం మాత్రం సర్వే సంస్థలకు.. మీడియాకు దిమ్మ తిరిగే షాకిచ్చింది. ఊహించని రీతీలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టాడు.
ఇక ఖచ్చితంగా గెలుస్తారనుకున్న హిల్లరీ క్లింటన్ ట్రంప్ చేతిలో ఓటమి చవిచూడడానికి గల కారణాల గురించి చర్చించుకుంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిల్లరీ, ట్రంప్‌ల మధ్య ప్రచారం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్ తన ప్రచారంలో 85 నినాదాలు వినిపిస్తూ ముందుకు సాగారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ మాత్రం సెపరేటు రూటులో వెళ్లారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే ఒకే ఒక్క నినాదాన్ని చేస్తూ తన ప్రచారం కొనసాగించారని.. ప్రపంచాన్ని పీడిస్తోన్న ఉగ్రవాదంపై మండిపడుతూ దాన్ని అంతమొందించే శక్తి తనకు ఉందని ఒప్పించడంలో ట్రంప్ విజయం సాధించారని తెలిపారు. మరోవైపు హిల్లరీ క్లింటన్ మాత్రం ఈ అంశాలపై వెనకపడిపోయారని.. అనేక విషయాల్లో ఆమెరికన్లకు భరోసా ఇవ్వలేకపోయి చివరికి ఓటమిని చవిచూశారు. ఉగ్రవాదంపై ట్రంప్ స్థాయిలో హిల్లరీ క్లింటన్ మాట్లాడలేకపోయారు. మరోవైపు ట్రంప్‌కి అమెరికాలోని నిరుద్యోగులు, నిరక్షరాస్యులు మద్దతుగా నిలిచారని అన్నారు.
ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ అమెరికన్లలో జాతీయ భావం నిండేలా ప్రచారం చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు. ఇక హిల్లరీ క్లింటన్‌కు ప్రచారం బాగానే చేసిందని… అమెరికన్లను ఆకట్టుకునేంతగా ప్రచారం నిర్వహించలేదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం జరిగినంత కాలం ఆమె చుట్టూ నిరంతరం మేధో మధనం జరిగిందని.. మీడియా కూడా హిల్లరీకే మద్దతు తెలుపుతూ ప్రసారం చేసిందని తెలిపారు. అయినా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుపొందడం.. 2016లో అమెరికాలో ఊహించని అతిపెద్ద పరిణామం అని విశ్లేషకులు పేర్కోన్నారు.