కాళేశ్వరంపై కాంగ్రెస్..ఎందుకిలా?

43
- Advertisement -

ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాలేశ్వరానికి గుర్తింపు తీసుకొచ్చింది గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ ప్రాజెక్ట్ ఒక్కటి కాదు. కొన్ని బ్యారేజిలు, పంపు హౌజులు, కాలువల సమాహారం. మేడిగడ్డ బ్యారేజి, అన్నారం బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజి.. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మిళితమై ఉన్నాయి. 80 వేల కోట్ల ప్రాథమిక వ్యయంతో జరిగిన ఈ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై వేలెత్తి చూపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇలా కాంగ్రెస్ నేతలంతా కూడా కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శిస్తూ వచ్చారు.

అయితే ఆ ప్రాజెక్టు ప్రాథమిక వ్యయమే 80 వేల కోట్లు అయితే లక్షల కోట్ల అవినీతి ఎలా జరిగిందనే సందేహాలు రాక మానవు. ఇక తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ లో కాళేశ్వరం పూర్తయ్యేసరికి అయిన ఖరుచు 93 వేల కోట్లని వెల్లడైంది. కానీ అధికార కాంగ్రెస్ నేతలు మాత్రం కాళేశ్వరంపై మళ్ళీ పాత పాటే పడుతున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేలా ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చెప్పడంతో అసలు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ వంటి ఇతరత్రా వాటిలో లోటుపాట్లు జరిగాయని గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరాన్ని పక్కన పెట్టె విధంగానే వ్యవహరిస్తుండడం అంతుచిక్కని విషయం. మరి ముందు రోజుల్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Also Read:Amith Shah:వారిద్దరికి అమిత్ షా వార్నింగ్?

- Advertisement -