సొంత పార్టీ నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడి…అలాగే ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి, లేబర్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్ తిరిగి ప్రారంభమయ్యేలోపు కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు లేబర్ పార్టీ నాయకత్వ ఎన్నికలు నిర్వహించనుంది. అప్పటివరకు స్టార్మర్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు.
ఇప్పుడు లేబర్ పార్టీ నాయకత్వ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, పలువురు సీనియర్ మంత్రులు, పార్టీ నేతల పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. ఆండీ బర్న్‌హామ్ …స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేయడంలో ఆండీ బర్న్‌హామ్ అందరికంటే ముందంజలో ఉన్నారని చాలామంది భావిస్తున్నారు. మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో విజయం సాధించిన తర్వాత, గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన బర్న్‌హామ్ ఇటీవల వెస్ట్‌మినిస్టర్ (పార్లమెంట్) లోకి తిరిగి ప్రవేశించారు. లేబర్ పార్టీ నాయకత్వ రేసులో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
వెస్ స్ట్రీటింగ్ …మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయిన వెస్ స్ట్రీటింగ్ అత్యంత బలమైన అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. గత నెలలో తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో స్టార్మర్ లేబర్ పార్టీని విజయపథంలో నడిపించలేరనే విషయం స్పష్టమవుతోందని స్ట్రీటింగ్ వ్యాఖ్యానించారు.
ఏంజెలా రేనర్…లేబర్ పార్టీలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఏంజెలా రేనర్ ఒకరు. పార్టీలోని సాఫ్ట్-లెఫ్ట్ (మధ్యస్థ వామపక్ష) వర్గంలో ఈమెకు మంచి ఆదరణ ఉంది. కార్మిక వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె తరచూ డిమాండ్ చేస్తుంటారు. నాయకత్వ పోటీ ఏర్పడితే తాను బరిలో ఉంటాననే విషయాన్ని ఆమె తోసిపుచ్చలేదు. భవిష్యత్తులో అందరి అంగీకారంతో ఏకగ్రీవ అభ్యర్థిగా ఆమె మారే అవకాశం ఉందని, లేదా ఆండీ బర్న్‌హామ్‌తో కలిసి కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని కొందరు లేబర్ నేతలు విశ్లేషిస్తున్నారు.
Also Read:కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్!
శబానా మహమూద్..హోం శాఖ మంత్రి శబానా మహమూద్ పేరు కూడా ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. లేబర్ పార్టీ రైట్ వింగ్ (కుడిపక్ష) లోని ప్రముఖ సభ్యుల నుండి ఆమెకు గట్టి మద్దతు లభిస్తోంది. భవిష్యత్ లేబర్ లీడర్‌గా ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. విమర్శకులు ఆమె విధానాలను మరీ మధ్యస్థంగా ఉన్నాయని అంటుండగా, మద్దతుదారులు మాత్రం ఆమెకున్న అనుభవాన్ని, విధానపరమైన నైపుణ్యాలను కొనియాడుతున్నారు.బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరో మరియు బ్రిటీష్ ప్రభుత్వ భవిష్యత్తు ఎటువైపో తేలడానికి రాబోయే కొన్ని నెలలు అత్యంత కీలకంగా మారనున్నాయి.

