Congress: మహిళలకు రూ.2500 ఎప్పుడు?

15
- Advertisement -

ఆరు గ్యారెంటీలలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు వంటి హామీలను అమల్లోకి తీసుకొచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ఇక మరో రెండు హామీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమైన సంగతి తెలిసిందే. రూ.500 లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు.. ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో ఈ పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు టాక్. ఈ రెండు హామీలను ఈ నెల 27 నుంచి అమలు చేయబోతున్నట్లు డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోనియా గాంధీ సమక్షంలో ఈ రెండు హామీలను అమల్లోకి తీసుకొస్తున్నామని, త్వరలో డ్వాక్రా మహిళాలకు వడ్డీలేని రుణాలపై కూడా స్పష్టత ఇవ్వబోతున్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. .

ఇకపోతే కాంగ్రెస్ హామీలలో భాగంగా రైతు రుణమాఫీపై కూడా తరచూ చర్చ జరుగుతోంది. రుణమాఫీ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నప్పటికి ఎప్పటినుంచి అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీనితో పాటు మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు రూ.2500 హామీ అమలు కూడా ఎప్పుడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు తర్వాత మిగతా హామీలపై వచ్చే నెలలో దృష్టి సారించనున్నట్లు సమాచారం. అయితే వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొత్త పథకాల అమలు జరుగుతుందా లేదా అనేది సందేహమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్లుగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాల అమలు ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి.

Also Read:సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్.. ‘బహుముఖం’

- Advertisement -