మన శరీరంలో లివర్ అత్యంత పెద్దదైన అవయవం. ఇది చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
అయితే నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు మద్యపానం, ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు. కానీ వాటితోపాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చక్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాదు సరికదా, అది మొత్తం లివర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివర్ పనితీరు మందగించి అది చెడిపోతుంది.
Also Read: హ్యాపీ బర్త్ డే…రవితేజ
2. నేటి తరుణంలో ఆహార పదార్థాలను రుచిగా అందించడానికి వాటిలో మోనోసోడియం గ్లుటమేట్ అనే పదార్థాన్ని ఎక్కువగా కలుపుతున్నారు. దీంతో ఈ పదార్థం ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు అది మన శరీరంలోకి ఎక్కువగా చేరుతోంది. దీని ప్రభావం ఎక్కువగా పడడంతో లివర్ చెడిపోతోంది.
3. విటమిన్ ఎ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ సమస్యలు ఉండవని అందరికీ తెలిసిందే. అయితే ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించినా దాని ప్రభావం లివర్‌పై పడుతుందట. దీంతో లివర్ ఆరోగ్యం నాశనమవుతుందట.
4. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడి పోతుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి.
5. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పువల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే.
6. చిప్స్ వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడం మంచిది.