దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు…ప్రత్యామ్నాయ అజెండా కావాలన్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన సీఎం కేసీఆర్…దేశ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషిస్తామన్నారు. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో గులాబీ జెండా రెపరెపలాడుతుందన్నారు.
ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా.. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సజీవంగా ప్రవహించే నదుల్లో ఉన్న నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని కేసీఆర్ తెలిపారు. మ 65 వేల టీఎంసీల నీరు ఉండి కావేరి జలాల కోసం తమిళనాడు – కర్ణాటక మధ్య యుద్ధం, సింధూ – సట్లెజ్ జలాల కోసం రాజస్థాన్ – హర్యానా మధ్య యుద్ధం ఏర్పడిందన్నారు.
దేశంలో అత్యధిక యువశక్తి ఉందని కేసీఆర్ తెలిపారు. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే.. ఇక్కడ వారి తల్లిదండ్రులు పార్టీలు చేసుకుంటున్నారన్నారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్‌లో కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ దేశ అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఉన్న సీఎంల సమక్షంలో, ప్రధాని అధ్యక్షతన వహించే నీతి ఆయోగ్‌లోనూ ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పాను. కానీ లాభం లేదని కేసీఆర్ పేర్కొన్నారు.