తెలంగాణ నయాగర … గద్దెల సరి..!

237
- Advertisement -

పచ్చని ప్రకృతి అందాలు…గలగల పారే జలపాతాలు..జోరు వానలకు కొత్త అందాలు అద్దుకున్నాయి. తెలంగాణలోని నయగారాలు గారాలు పోతూ , పరవళ్లు తొక్కుతూ పర్యాటకుల్ని ఆహ్వానిస్తున్నాయి. మొన్నటిదాక బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని బొగత జలపాతం ఒక రమణీయ దృశ్యమైతే దానిని తలదన్నే రీతిలో అదే జిల్లాలో మరో కమనీయ దృశ్యం వెలుగులోకి వచ్చింది.

Waterfalls Attracts Tourists In Jayashankar Bhupalpally Dist

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం (కే) మండలం వీరభద్రవరం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయత మధ్యన సుమారు 700 అడుగుల ఎత్తు నుంచి ముత్యంధార జలపాతం జాలువారుతోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఈ భారీ జలపాతం ఉంది. ఎగువనున్న కొండలను దాటుకుంటూ పాలనురగలా కిందకు ప్రవహిస్తూ సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోంది. గద్దలు ఎగిరేంత ఎత్తులోంచి నీటి ధార పడుతుండటంతో దీన్ని గద్దెల సరి జలపాతం అని కూడా పిలుస్తున్నారు.

పూర్వయుగం నాటి మానవులు నిర్మించిన అరుగులతోపాటు.. నునుపుదేలిన ఆయుధాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అరుగులు గులకరాళ్లు, బంకమన్నుతో తయారుచేసి ఉన్నాయి. రాతి ఆయుధాలు తయారు చేసుకోవడానికో, వేటాడిన జంతువులను కోసి మాంసం సేకరించడానికో ఆ అరుగులను వినియోగించినట్టు తెలుస్తుంది.

దేశంలో మూడో ఎత్తయిన జలపాతంగా దీనిని అభివర్ణిస్తున్నారు. కర్ణాటకలోని జోగ్‌ జలపాతం, మేఘాలయలోని జలపాతాల సరసన ఇది నిలుస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. ముత్యంధార జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి తలమానికంగా మారే అవకాశం ఉందని స్ధానికులు కొరుతున్నారు. భూపాలపల్లి జిల్లా రొయ్యూరు-పూసూరు మధ్య ఉన్న వంతెన దాటి చర్ల మార్గంలో 28 కి.మీ ప్రయాణిస్తే నాయకపోడు-కోయ గిరిజనుల గూడెం రామచంద్రాపురం వస్తుంది. అక్కణ్నుంచి 9 కి.మీ దూరంలో ఎత్తయిన గుట్టలప్రాంతం గద్దెలసరి ఉంది. ఇక ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.

- Advertisement -