నేటి నుంచి జూరాలకు నీటి విడుదల..

237

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస‍్వామితో జూరాలకు నీటి విడుదలపై చర్చించిన విషయం తెలిసిందే. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ కోరగా. దీనిపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి.. కర్ణాటక సీఎస్ టీఎం విజయ్ భాస్కర్‌కు లేఖ రాశారు.

తాగునీటి అవసరాలకు నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని ఎస్‌కే జోషి విజ్ఞప్తి చేశారు. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్న ఆవాస గ్రామాలకు నీటి ఎద్దడి ఉన్నందున వీలైనంత త్వరగా నారాయణ్‌పూర్ నుంచి నీరు విడుదల చేయాలని కర్ణాటక సీఎస్‌ను జోషి కోరారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించడంతో ఈ సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది.