99 ఏళ్ల తర్వాత తొలిసారి అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంపూర్ణంగా కనిపించింది. అమెరికా పశ్చిమ తీరాన ఆరెగావ్ నుంచి తూర్పు తీరాన దక్షిణ కరోలినా దాకా.. 4000 కిలోమీటర్ల పొడవున.. 14 రాష్ట్రాల్లో ‘ద గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్‌గా వ్యవహరిస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9.45 నుంచి (స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం దాదాపుగా అదే సమయం) రాత్రి 12.28 గంటల దాకా గ్రహణం కనిపించింది. కాగా, కొన్ని చోట్ల పాక్షికంగానే అయినా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించే సూర్యగ్రహణం రావడం 99 ఏళ్ల (1918) తర్వాత ఇదే మొదటిసారి రావడంతో అమెరికన్లంతా సోమవారం ఈ గ్రహణాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాలకు తండోపతండాలుగా చేరుకున్నారు. ఈ గ్రహణాన్ని ప్రపంచం మొత్తం వీక్షించడం కోసం నాసా తన వెబ్‌సైట్‌తో పాటు, ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లోనూ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.