కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్లు పెరిగిపోతున్న ఈ కాలంలో ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువయిపోయింది. వాకింగ్ కు వెళ్లినా, జాగింగ్ కు వెళ్లినా, పనిచేస్తున్నా.. ఇలా ఎక్కడ చూసినా ప్రతిఒక్కరు చెవుల్లో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తుంటాయి. క్లబ్బుల్లో హోరెత్తే సంగీతంతో పాటు.. చెవిలోపలికి దూరి మరీ భారీ శబ్దాలను వినిపించే హెడ్ ఫోన్స్ కారణంగా 40 ఏళ్లు వచ్చే లోపే హియర్ మెషిన్ లను చెవులకు తగిలించుకునే పరిస్థితి వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ఇవి వాడటం మంచిదే! నేరుగా ఫోన్ ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే.. దాని ఫ్రిక్వెన్సీస్ మెదడుకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అలాంటప్పుడు ఇయర్ ఫోన్స్ వాడిటంలో ఎటువంటి ప్రమాదం లేదు. కానీ.. ఫ్యాషన్ అన్న పేరుతో దాన్ని మరీ విపరీతంగా వాడేస్తున్నారు. అలా నిత్యం ఇయర్ ఫోన్స్ వాడటం కూడా చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిత్యం చెవుల్లోనే ఇయర్ ఫోన్ వాడటం వల్ల దానిమీదే ఎక్కువ ధ్యాస వుంటుందని, తద్వారా ఇతరులతో మసలుకునే స్వభావం తగ్గిపోతుందని, దీంతో ఒంటరితనం పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిత్యం పాటలు వినడంతో ఆ శబ్దాలు ఇయర్ ఫోన్స్ తీసిన తర్వాత కూడా వినిపిస్తూనే వుంటాయని, దీంతో ప్రశాంతతను కోల్పోతారని వెల్లడించారు.