ఆర్టీసీ సమ్మె విరమించుకోవాలి

466
Errabelli Dayakar Rao
- Advertisement -

ఆర్టీసీ సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికులు, సంఘాలు పునరాలోచన చేయాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. తెలంగాణ సంస్కృతిగా నిలిచే సద్దుల బతుకమ్మ, దసరా పండగలపూట ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ అధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి శనివారం హన్మకొండలోని మంత్రి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సమ్మె కారణంగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని… ఆర్టీసీ సంఘాలు, కార్మికులు సమ్మె కొనసాగించే విషయంలో పునరాలోచన చేయాలని కోరారు.‘తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తింపుగా నిలిచే సద్దుల బతుకమ్మ పండగ కోసం రాష్ట్రంలోని మహిళలు సొంత ఊళ్లకు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి మహిళలే బస్సుల్లో ప్రయాణిస్తారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ సమ్మె వల్ల అందరూ ఇబ్బంది పడుతారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సానుకూలంగా ఉన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వపరంగా వేతనాలు, ఇతర సదుపాయలు కల్పిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రస్తుత డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పండగ సమయంలో కలిగే ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని సమ్మెను నిలిపివేయాలి. అన్ని డిమాండ్ల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది’ అని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు కార్మికులను, సంఘాలను కోరారు.

- Advertisement -