బండి వర్సెస్ ఈటల.. బీజేపీలో గ్రూపు రాజకీయాలు..!

83
Bandi Sanjay
- Advertisement -

కమలం పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో ఎవరికి వారుగా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పోటీగా ఆ పార్టీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్‌ రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. బండి సంజయ్‌ దక్షిణ తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా పాల్గొనేందుకు ఈటల ఆసక్తి చూపడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్రలో నిమగ్నమైన తరుణంలో ఈటల రాజేందర్‌ పార్టీలో సొంతంగా బలం పెంచుకొనే లక్ష్యంతో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌ సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్‌ సమావేశాలకు హాజరయ్యారు. అంతే కాకుండా.. మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటించారు. వరుసగా ఇతర జిల్లాల్లోనూ ఇదే రకమైన కార్యక్రమాలతో ముందుకుపోయేలా ఈటల ప్రణాళిక వేసుకున్నట్టు ఆయన వర్గీయులు చెప్తున్నారు. బండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భాగమైన హుజూరాబాద్‌ నుంచి ఈటల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీలో కొత్తగా చేరిన ఈటల రాష్ట్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.

రాష్ట్రస్థాయిలో రాజకీయంగా తనకన్నా జూనియర్లు బీజేపీకి నేతృత్వం వహిస్తున్నారని, దీన్ని అవకాశంగా తీసుకొని సొంత బలం పెంచుకోవాలని ఈటల ప్రణాళికతో ఉన్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒకే జిల్లాకు చెందిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మధ్య ఇప్పటికే అంతరం పెరిగింది. రాష్ట్ర నాయకత్వాన్ని ఖాతరు చేయకుండా ఈటల సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై బండి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఈ కారణాలతో ఇద్దరు నేతల మధ్య ఇప్పటికే దూరం పెరిగింది. బండి పాదయాత్ర సమయంలో ఈటల ఇలా జిల్లాల పర్యటనలు చేస్తుండటంతో ఈ అంతరం ఇంకా పెరుగుతున్నదని బీజేపీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

- Advertisement -