మరో సైబర్‌ దాడి తప్పదా..?

225
wanna-cry-ransomware-cyber-attack
wanna-cry-ransomware-cyber-attack
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వాన్నక్రై మాల్‌వేర్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ వైరస్ సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. బ్రిటన్ ఆసుపత్రుల్లో కంప్యూటర్ వ్యవస్థ పనిచేయలేదు. జపాన్‌లో రైళ్లు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి.. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 18 పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లు స్తంభించిపోయాయి. సైబర్‌ భద్రత చరిత్రలోనే ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. శుక్రవారం మొదలైన ఈ సైబర్‌ దాడి కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలకు విస్తరించింది.

దీనికి యాంటీ వైరస్‌ రాక ముందే.. మరోమారు హ్యాకర్లు పంజా విసిరేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు సైబర్‌ నిపుణులు. యూకేకు చెందిన ప్రముఖ సైబర్‌ నిపుణుడొకరు డారెన్‌ హుస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దాడి సోమవారమే జరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న రామ్సమ్‌వేర్‌ దుష్పరిణామాన్ని తగ్గించే మార్గం కనిపించిన ఆయన మరోదాడి ఉంటుదంటున్నారు. సిస్టమ్స్‌ను ప్యాచ్‌ చేసుకోవటం ద్వారా ఇప్పుడొచ్చిన వాన్నక్రై ప్రభావాన్ని తగ్గించామని.. కానీ రాబోయే వైరస్‌ను ఎదుర్కోవటం కష్టమన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. పాత మాల్‌వేర్‌ కోడింగ్‌లో స్వల్పమార్పులతో ప్రపంచ సైబర్‌ వ్యవస్థపై దాడి చేయవచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. ఇది హ్యాకర్లకు అత్యంత సులువైన పని అని పేర్కొన్నాడు.

 wannacry-ransomware-attack

‘వనా క్రై’లేదా ‘వనా డిక్రిప్టర్‌’అనే ఈ వైరస్‌.. ఈ–మెయిల్‌ అటాచ్‌మెంట్లు, ఇతర ఫైళ్లు, డౌన్‌లోడ్‌ల ద్వారా కంప్యూటర్లలోకి ప్రవేశిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఉన్న లోపాల ద్వారా కంప్యూటర్‌లోని సమాచారం (డేటా.. ఫైళ్లు) మొత్తానికి తాళం (ఎన్‌క్రిప్ట్‌) వేస్తుంది. దానిని తీయాలంటే 300 డాలర్ల విలువైన బిట్‌కాయిన్స్‌ (డిజిటల్‌ వర్చువల్‌ కరెన్సీ) చెల్లించాలని డిమాండ్‌ చేస్తుంది. ఆ మొత్తం చెల్లించినా ఫైళ్ల తాళం తెరుచుకుంటుందన్న (డీక్రిప్ట్‌ అవుతుందన్న) గ్యారెంటీ లేదు.

wanamap

స్వీడన్‌ మొదలైన ఈ వైరస్ దాడులు.. బ్రిటన్.. ఫ్రాన్స్‌.. రష్యా.. ఇలా కొద్ది గంటల్లోనే 104 దేశాలను తాకింది.. వైరస్‌ దాడిని తొలుత గుర్తించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 75,000 దాడులు నమోదైనట్లు సైబర్‌ భద్రతా రంగ సంస్థ అవాస్ట్‌ వెల్లడించింది. గత 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్లు ఈ వైరస్‌ బారినపడినట్లు గుర్తించింది. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇటలీ, ఈజిప్టు, ఇండియా సహా 99 దేశాల్లో 45,000కుపైగా దాడులను కాస్పర్‌స్కీ ల్యాబ్‌ సైబర్‌ భద్రతా నిపుణులు గుర్తించారు.

wannacry-starts-through-an-email-in-which-hackers-trick-the-victim-to-view-attachments-which-releases-a-malware-on-their-system-youtube

యూకేలో మొత్తం 48 సంస్థలు మాల్‌వేర్‌ బారినపడ్డాయి. వీటిల్లో ఆరు సంస్థల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని యూకే హోం సెక్రటరీ యాంబర్‌ రుడ్‌ తెలిపారు. భవిష్యత్తులో కూడా మరోసారి దాడుల బారిన పడకుండా చర్యలు తీసుకున్నాం అని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా.. తాజా మాల్‌వేర్‌తో ప్రపంచ దేశాల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేసిన వాన్న క్రై మాల్‌వేర్‌కు ఇప్పటివరకూ 22వేల డాలర్ల వరకూ ఆదాయాన్ని పొందినట్లుగా అంచనా వేస్తున్నారు.

శుక్రవారం సైబర్‌ నేరగాళ్లు విరుచుకుపడేసరికి భారత్‌లో చాలా కార్యాలయాలు, బ్యాంకులు, మూతబడ్డాయి. ఇవి సోమవారం తెరుచుకోనున్నాయి. ఇక్కడ సిస్టమ్స్‌ ఆన్‌ చేస్తే కానీ.. వాన్నా క్రై రాన్సమ్‌వేర్‌ ప్రభావం మన దేశంపై ఏమేరకు ఉందో తెలియదు. పెద్దఎత్తునే ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మాల్‌వేర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అప్పటి వరకూ రిజిస్టర్‌ కాని డొమైన్ పేరుతో కిల్లర్‌ స్విచ్‌లు సృష్టించిన అటాకర్లు.. కొత్త దాడిలో ఆ స్విచ్‌ పనిచేయకుండా కూడా కోడ్‌ను మార్చి ఉంటారని.. అంటున్నారు. వాన్నా క్రై’ రాన్సమ్‌ వేర్‌ దాడికి కారణమైన హ్యాకర్లను పట్టుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నిఘా సంస్థలు, పోలీసులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ దాడిని ఒక్కరే చేసి ఉండరని.. ఈ దాడి వెనుక పెద్ద హ్యాకర్ల నెట్‌వర్క్‌ ఉండొచ్చని భావిస్తున్నారు.

- Advertisement -