కర్ణాటక ఎన్నికల ప్రచారం కాంగ్రెస్,బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయికి చేరింది. ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో నోరు జారి నేతలు కొత్త కష్టాలు తెచ్చుకుంటున్నారు. మొన్న అమిత్ షా టంగ్ స్లిప్ కాగా తాజా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నోరు జారి నాలుక కరుచుకున్నారు.
మలవళ్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు ఆయన వెళ్లారు. అక్కడ పార్టీ అభ్యర్థి పేరు నరేంద్ర స్వామికాగా… ఇక్కడే సిద్ధ రామయ్య తప్పులో కాలేశారు. నరేంద్ర స్వామి అనబోయి పొరపాటుగానరేంద్ర మోడీ అన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్ల నిర్మాణం తదితర పనులు నరేంద్ర మోడీ, తమ ప్రభుత్వం వల్లే జరిగాయని చెప్పారు. వెంటనే స్వామి కలగజేసుకోవడంతో సిద్ధరామయ్య నాలుక కరుచుకుని ‘సారీ సారీ.. నరేంద్ర స్వామి’ అని చెప్పారు.దీంతో వేదికపై కూర్చున్న వారు సహా ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు కనిపించాయి.
కర్ణాటక ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా సైతం పలుమార్లు నోరుజారి నాలుక కరుచుకున్నారు. యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనే సరికి అంతా బిత్తరపోయి చూశారు. యడ్యూరప్ప కూడా షాక్‌కు గుర్యారు. పక్కన ఉన్నవారు యడ్యూరప్ప కాదు సిద్ధరామయ్య అని చెప్పడంతో అమిత్‌షా మళ్లీ సర్దుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 1 అని చెప్పి సరిదిద్దుకున్నారు. తాజాగా సిద్దరామయ్య నోరు జారడం కన్నడలో చర్చనీయాంశంగా మారింది.