బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్‌గా తెరకెక్కుతున్న పీఎం నరేంద్ర మోడీ చిత్రంలో నటిస్తున్న వివేక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
2024 ఎన్నికల్లో వడోదర నుండి పోటీచేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు తనకెంతో నచ్చాయని..అందుకే ఇక్కడి నుండి బరిలోకి దిగాలనుకుంటున్నానని తెలిపారు.
మోడీ బయోపిక్… ఆదర్శవంతుడైన వ్యక్తి జీవిత కథ అని ఒక సాధారణ మనిషి ప్రధాని ఎలా అయ్యారనేది ఈ చిత్రంలో చూపించారని చెప్పారు. రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉంటూ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎలా మారారో తెరపై చూడాల్సిందే అన్నారు.
మోడీ బయోపిక్‌ను ఆపాలని కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. ప్రజలను ప్రభావితం చేసేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదులో పేర్కొనగా ఏప్రిల్ 5న విడుదలకావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
2014 ఎన్నికల్లో మోడీ గుజరాత్‌లోని వడోదర నుండి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారణాసి నుండి బరిలో ఉన్నారు మోడీ. అయితే వివేక్…మోడీ నియోజకవర్గం నుండి బరిలో నిలుస్తానని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.