తెలుగు రాష్ట్రాల… బిగ్ షాట్స్

262
telugu states
- Advertisement -

తెలుగు రాష్టాల్లో ఎన్నికల వేడి రోజురోజుకి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు రెబెల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ పత్రాల్లో చూపించిన ఆస్తుల లెక్కలు చూస్తే నేతల ఆస్తులు అంతకంతా పెరిగిపోతున్నాయి.

తెలంగాణలో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఆస్తులున్న అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఆస్తులు రూ.895కోట్లు.2014 ఎన్నికలప్పుడు పేర్కొన్న ఆస్తులతో పోలిస్తే రూ.528.52 కోట్ల నుంచి రూ.895కోట్లకు పెరిగినట్లు వెల్లడైంది. ఆయన తర్వాత నారాయణ విద్యాసంస్థల అధినేత, నారాయణ రూ.650కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనకు రూ.339కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్‌లో పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నారా లోకేశ్ తన పేరిట రూ.253.68 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డికి రూ.163కోట్లు, జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 119.75కోట్ల ఆస్తులున్నాయి.

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ఆస్తులు రూ.87.67 కోట్లు కాగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆస్తులు రూ.58.63కోట్లు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌కు రూ.54.61కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

మెదక్‌ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి స్థిర, చరాస్తులు కలిపి రూ.126.65 కోట్లు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ఆస్తులు రూ.87.80 కోట్లు కాగా ఆయనకు అమెరికాలో ఇళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న రేవంత్‌రెడ్డి.. తన కుటుంబానికి రూ.24.48 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రమాణపత్రంలో తెలిపారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం తన ఆస్తులు 66 కోట్లు అని ప్రకటించగా అప్పులు 33 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి గత ఎన్నికలతో పోలీస్తే తెలుగురాష్ట్రాల్లో ఈ సారి కోటీశ్వరులు పెద్దసంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు.

- Advertisement -