‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మార్కెట్‌ను నిరూపించుకున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఆయన కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచింది. ఈ భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టారు.
చిరు కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘విశ్వంభర’ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా విడుదలకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై తొలి వారంలో, ముఖ్యంగా జూలై 9 లేదా 10వ తేదీన సినిమాను థియేటర్లలో విడుదల చేయాలన్న ప్రణాళికపై చిత్ర బృందం కసరత్తు చేస్తోంది.
సోషియో ఫాంటసీ అంశాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, చిరంజీవి పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

