టాలీవుడ్ క్యూటీ సమంత మళ్ళీ మాయచేసింది. పెళ్లైన తర్వాత కూడా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ వరస చిత్రాలతో దూకుడు పెంచిన ఈ చిన్నది.. రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘రంగస్థలం’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. తమిళ నటుడు విశాల్‌తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది. తమిళ సినిమా ‘ఇరుబుత్తిరై’ను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా..ప్రేమికుల రోజు సందర్భంగా బుధవారం ఈ సినిమాలోని ‘యాంగ్రీబర్డ్’ పాట వీడియో ప్రోమోను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. విశాల్, సమంత మధ్య జరిగే సరదా సన్నివేశాలను ఇందులో చూపించారు. తనదైన హావభావాలతో సమంత అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇటీవలే ‘రంగస్థలం’ సినిమాలోని ‘రామలక్ష్మి’ టీజర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శామ్.. ఇప్పుడు ప్రోమోతో ఇలా అందరినీ తన వైపునకు తిప్పుకుంటోంది.
‘ఏం మాయ చేసావె’తో మాయ చేసిన సమంత.. మరోసారి ఆ స్థాయిలో ‘మాయ’ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ టెక్నో థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.