ఒక్క సెంచరీతో దిగ్గజాలను అధిగమించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. విండీస్ పర్యటనలో భాగంగా రెండో వన్డేలో 120 పరుగులతో సెంచరీ చేసిన కోహ్లీ..11 ఇన్నింగ్స్‌ల తర్వాత కెప్టెన్‌గా శతకం సాధించడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ సెంచరీతో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచంలోని మూడు వన్డే జట్లపై ఎనిమిది అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఆసీస్,శ్రీలంక,విండీస్‌లపై 8 సెంచరీలు చేసి అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ ఆసీస్‌పై తొమ్మిది, శ్రీలంకపై ఎనిమిది శతకాలు సాధించాడు. అయితే సచిన్ రెండు జట్లపై 8 సెంచరీలు చేయగా విరాట్ మూడు జట్లపై 8 సెంచరీలు చేసి భారీ రికార్డు నెలకొల్పాడు.
దీంతో పాటు విండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ (2032) నిలిచాడు. కరేబియన్ దీవుల్లో జరిగిన వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ(120) సాధించాడు. కోహ్లీ కంటే ముందు 2003లో బ్రయాన్‌లారా(116) పరుగులు చేశాడు.