బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నా కొద్దిసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, వ్యాధి మరింతగా పెరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల పూర్తి బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వినోద్ ఖన్నా మృతిపై బాలీవుడ్ వర్గాలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపాయి.
ఇటీవల ఆన్‌లైన్‌లో ఆస్పత్రిలో ఉన్న వినోద్ ఖన్నా ఫొటో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యం క్షీణించి, సన్నబడిపోయిన దేహంతో ఆస్పత్రి దుస్తులతోనే కుమారుడు, భార్యతో ఆ ఫొటోలో వినోద్ ఖన్నా నిలబడలేకుండా ఉన్నాడు. చివరిసారిగా షారుఖ్, కాజోల్ మూవీ దిల్ వాలే లో నటించిన ఖన్నా నేడిలా అతి బలహీనమైన స్థితిలో కనిపించడం ఆయన అభిమానులను భాదకు గురిచేసింది.
71 ఏళ్ల వినోద్ ఖన్నా 2014లో గురుదాస్ పూర్ నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. మొత్తం 141 చిత్రాల్లో నటించిన ఆయన, పలు చిత్రాలను స్వయంగా నిర్మించారు. హెరాఫెరీ,ఖూన్ ఫసీనా, అమర్ అక్బర్ ఆంథోని, పర్వరీష్, మేరా గావ్ మేరా దేశ్ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాందిని చిత్రంలో శ్రీదేవి పక్కన హీరోగా కూడా నటించారు. వినోద్ ఖాన్నాకు రాహుల్ ఖన్నా,అక్షయ్ ఖాన్నా ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్షయ్ ఖన్నా పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించారు.