ఒకప్పుడు భారత క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన వినోద్ కాంబ్లీ (54), ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కఠినమైన పోరాటం చేస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, మెదడులో రక్తం గడ్డకట్టడం (Clot) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు.
గతేడాది ముంబైలో జరిగిన రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో కాంబ్లీ పరిస్థితి చూసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ రోజు ఆయన కనీసం నిలబడలేక, నడవలేక తన స్నేహితుడు సచిన్ టెండూల్కర్ చేతిని పట్టుకుని ఆసరా పొందడం అందరినీ కలిచివేసింది. గతంలో థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్రమైన యూరినరీ ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందిన ఆయన, ఇప్పుడు కోలుకుంటున్నప్పటికీ కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
కాంబ్లీ ప్రస్తుతం మెదడులో రక్తం గడ్డకట్టిన సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మద్యానికి దూరంగా ఉన్నారు.జ్ఞాపకశక్తి మందగించడం వల్ల తాను సిగరెట్ తాగకూడదనే విషయాన్ని ఆయన తరచుగా మర్చిపోతున్నారు. బయటకు వెళ్లినప్పుడు గుర్తుపట్టిన ఆటో డ్రైవర్లను లేదా బాటసారులను అడిగి మరి సిగరెట్ తాగుతున్నారని, ఇది ఆయన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోందని సమాచారం.
Also Read:జూన్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’!
కాంబ్లీ స్నేహితుడు మార్కస్ కోటో ఈ కష్టకాలంలో ఆయనకు అండగా నిలుస్తున్నారు. వినోద్ సహాయార్థం నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాను. అందులో కొందరు మిత్రులు పేరు బయటకు రాకుండా ఆర్థికంగా చాలా సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మెదడులో సమస్య వల్ల శారీరక సమతుల్యత (Balance) తప్పుతోంది అని కోటో వివరించారు.
డిసెంబర్ 2024లో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ముందుకు వచ్చి కాంబ్లీని రిహాబిలిటేషన్ (పునరావాస కేంద్రం)కు పంపాలని ప్రతిపాదించారు. 1983 వరల్డ్ కప్ జట్టు సభ్యులు కూడా ఇందుకు సిద్ధమయ్యారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చర్చలు ఫలించలేదు, దీంతో ఆ ప్రయత్నం మధ్యలోనే నిలిచిపోయింది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా కాంబ్లీ కోలుకోవాలని ఆశిస్తూ తమ వంతు మద్దతు తెలుపుతున్నారు.

