తమిళ సినీ పరిశ్రమలో పైరసీ భూతం మరోసారి పడగ విప్పింది. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ ఇంకా అధికారికంగా విడుదల కాకముందే, కోయంబత్తూరులోని ఒక లోకల్ కేబుల్ ఛానెల్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఘటనతో అటు చిత్ర యూనిట్, ఇటు అభిమానులు షాక్‌కు గురయ్యారు.
కోయంబత్తూరు నగరంలోని ఒక స్థానిక కేబుల్ టీవీ ఛానెల్, ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన లీకైన వెర్షన్‌ను (Pirated Version) ఏకంగా టీవీలో ప్రసారం చేసింది. సినిమా రిలీజ్ డేట్ కోసం వేచి చూస్తున్న అభిమానులు, తమ లోకల్ ఛానెల్‌లో ఏకంగా పూర్తి సినిమా ప్లే అవుతుండటాన్ని గమనించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరు పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలను ఉల్లంఘించి, కాపీరైట్ చట్టాలకు విరుద్ధంగా ఇంకా విడుదల కాని సినిమాను ప్రసారం చేసినందుకు గాను సదరు కేబుల్ టీవీ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. * సెక్షన్లు: పైరసీని ప్రోత్సహించినందుకు మరియు సినిమాను అక్రమంగా ప్రసారం చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read:‘డెకాయిట్’..మంచి సినిమా తీశాం!
సినిమా లీక్ మూలాలు: ఈ లీకైన వెర్షన్ ఆపరేటర్‌కు ఎక్కడి నుండి అందిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు ఇలా విడుదలకు ముందే లీక్ అవ్వడంపై నిర్మాతలు మరియు దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ వంటి పెద్ద హీరో సినిమా ఇలా లోకల్ ఛానెల్‌లో రావడం సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఛానెల్ ప్రసారాలను నిలిపివేసి, ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

