దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విజయాల్లో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ వాటా కూడా ఉంది. బలమైన కథా కథనాలతో భారీ చిత్రాలను తెరకెక్కించాలనుకున్న దర్శక నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే రచయిత విజయేంద్ర ప్రసాద్. కథలో ఆసక్తికరమైన ఘట్టాలు .. అనూహ్యమైన మలుపులతో ఆయన ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తూ, మరో లోకానికి తీసుకెళతారు. అప్పుడప్పుడు దర్శకుడిగా కూడా తన అభిరుచిని చాటుకునే ప్రయయత్నం చేస్తుంటారు. ఎందుకంటే రాజమౌళి చిత్రాలకు కథ అందించి, తెర వెనుక విజయ సారథిగా నిలిచింది ఆయనే. ‘భజరంగీ భాయ్‌జాన్’తో బాలీవుడ్‌లోనూ ఆయన పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని తన దర్శకత్వంలోనే తెరకెక్కించారు.
ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘శ్రీవల్లీ’ .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగా ‘మహాభారతం’ ప్రస్తావన వచ్చింది. అప్పుడాయన స్పందిస్తూ రాజమౌళి ‘మహాభారతం’ తీస్తాడని తాను ఇంతకు ముందు ఎక్కడా చెప్పలేదనీ, అయితే ఆయన తప్పకుండా తీసే అవకాశం ఉందని అన్నారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన ‘మహాభారతం’ తెరకెక్కించవచ్చని చెప్పారు.