తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రాములమ్మ ఈ సారి దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తొలుత ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాలని భావించిన విజయశాంతి సన్నిహితుల ఒత్తిడి మేరకు
మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ నేతలు సైతం విజయశాంతిని దుబ్బాక నుంచి పోటీలో నిలిపితే విజయం తథ్యమని భావించారట. రేపో లేదో ఎల్లుండి ప్రకటించే తొలి జాబితాలో విజయశాంతి పేరు ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 54 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించనున్నట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు… టీపీసీసీ ముఖ్య నేతలు, ఆశావహులతో చర్చించి రాష్ట్రంలోని అన్ని
నియోజకవర్గాలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేశారు. రాహుల్ అమోదముద్ర వేయడమే తరువాయి జాబితాను విడుదల చేయనున్నారు పీసీసీ నేతలు.