దాదాపు 13ఏళ్ల గ్యాప్ తర్వాత నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ మెగాస్టార్ విజయశాంతి. 2006లో ‘నాయుడమ్మ’ సినిమా తరువాత విజయశాంతి రాజకీయాలలో బిజీ అయ్యారు. ఆ కారణంగా ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. మళ్లీ ఇంతకాలానికి.. ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో గ్లామరస్ నాయికగా ఎంత పాపులారిటీ దక్కిందో అంతకుమించి ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో అభిమానుల గుండెల్లో నిలిచిన టాప్ స్టార్ గా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారు.
ఇక ఈ సినిమాలో ఆమె రాయలసీమకి చెందిన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి విజయశాంతి లుక్ ఎలా వుండనుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున విజయశాంతి ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా 12 జనవరి 2020న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.