ప్రముఖ సినీనటి, టీపీసీసీ ప్రచార కమిటీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి శాసనసభ బరిలోకి దిగనుంది, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీకి పోటీ చెయ్యాలనే అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీ వార్ రూమ్‌లో మంగళవారం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే విజయశాంతిని మెదక్ స్థానం నుంచి పోటీకి దించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 11.30 గంటలు దాటినా కొనసాగింది. కాంగ్రెస్ తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌దాస్, సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ, మండలి పక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ సమావేశంలో పాల్గొన్నారు.
ముందు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలపై చర్చించారు. అనంతరం ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి పాత జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలపై కసరత్తు సాగింది. కొద్దిసేపు విరామం తర్వాత హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ పాత జిల్లాలపై చర్చించారు. ఏడుగురు మాజీ ఎంపీలను శాసనసభ బరిలో నిలపాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
బరిలో దిగనున్న అభ్యర్థుల వివరాలు.. పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), సురేశ్ షెట్కార్ (నారాయణఖేడ్), విజయశాంతి (మెదక్), రమేశ్ రాథోడ్ (ఖానాపూర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), మల్లు రవి (జడ్చర్ల), సర్వే సత్యనారాయణ (మల్కాజ్‌గిరి/కంటోన్మెంట్).