మాల్యాకు బెయిల్ మంజూరు

221
Vijay Mallya Arrested In London, Granted Bail
- Advertisement -

ఇలా అరెస్టయ్యారో లేదో అప్పుడే లిక్కర్ రారాజుకు బెయిల్ మంజూరైంది. భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యా లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌ జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన మూడు గంటల్లోనే మాల్యాను బెయిల్ పై విడుదల చేసింది లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు. ఆరు లక్షల 50వేల పౌండ్ల పూచీకత్తు సమర్పించారు. తదుపరి విచారణను 2017, మే 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాను అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వం, ఆర్థికశాఖ సాధించిన పెద్ద విజయమని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. విజయ్‌మాల్యా అరెస్టుపై ఆయన స్పందించారు. బ్యాంకులకు సుమారు రూ.9వేలకోట్లు ఎగవేసిన మాల్యా గతేడాది లండన్‌కు పారిపోయారు. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు యూకే ప్రభుత్వం మాల్యాను అరెస్టు చేసింది. మాల్యాను త్వరలోనే భారత్‌కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

అరెస్ట్ – బెయిల్ పై ట్విట్టర్ లో స్పందించారు మాల్యా. భారత్ మీడియా అతి చేస్తోంది అని అసహనం వ్యక్తం చేశారు. నేను అనుకున్నట్లుగానే ఇవాళ (ఏప్రిల్ 18) కోర్టు కేసు నడిచింది. ముందుగానే ఊహించిన విషయమే అంటూ విజయ్ మాల్యా ట్విట్ చేయటం విడ్డూరం.  కోర్టు మెట్లు ఎక్కిన మాల్యాను ఇండియా తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బ్రేకింగ్ న్యూస్ చల్లారకముందే.. బెయిల్ పై విడుదల అవ్వటంతో షాక్ అయ్యారు అందరూ. దీనిపై సోషల్ మీడియా హోరెత్తింది.

- Advertisement -