టాలీవుడ్ హీరో, తెలంగాణ ట్రెండ్‌సెటర్ విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం విజయ్ ట్యాక్సీవాల, డియర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన మరో సినిమా నోటా. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుండగా, తాజాగా విజయ్ తర్వాతి చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఓ తమిళ దర్శకుడి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ తర్వాతి మూవీ తెరకెక్కనుండగా,ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. చిత్రంలో కథానాయికగా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తీసుకోనున్నారని సమాచారం. శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్లో చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ దక్షిణాది సినిమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడు చర్చలు జరుపుతున్నారు. అన్నీ కొలిక్కి వస్తే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన నటించవచ్చని సినీ విశ్లేషకుటు తెలుపుతున్నారు. ముగ్గురు దర్శకులతో ప్రస్తుతం సినిమాలకు సంబంధించి జాన్వీ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.