సినిమా పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకోవడం అనేది చిన్న విషయమేమీ కాదు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, భవిష్యత్తు గురించి ఆలోచించే ముందు తన సినీ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారు. కథానాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రం విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు పదేళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో సహకరించిన అభిమానులు, స్నేహితులు మరియు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగ నోట్‌ను పంచుకున్నారు. అలాగే ‘పెళ్లి చూపులు’ మొదటి రోజు షూటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒక పాత వీడియోను షేర్ చేశారు. ఉదయం 7 గంటల షూట్ కోసం తాను 6:30 గంటలకే సెట్స్‌లో రిపోర్ట్ చేసినట్లు అందులో గుర్తుచేసుకున్నారు.
‘పెళ్లి చూపులు’ సినిమాకి సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్ ఫోటోలు, వీడియోలను ‘X’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ గత దశాబ్ద కాలంలో తన జీవితం ఎంతగా మారిపోయిందో విజయ్ వివరించారు. థియేటర్లలో ప్రేక్షకులు తనను మొదటిసారి ఆదరించిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, అప్పుడే పదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానని రాసుకొచ్చారు.
10 సంవత్సరాలు… 10 ఏళ్ల క్రితం మనం థియేటర్లలో మొదటిసారి కలిశామని, కలసి నవ్వుకున్నామని, ఒకరినొకరం ఇష్టపడ్డామని, ఈ రోజుకీ మనల్ని కలిపి ఉంచే ఒక బలమైన బంధం ఏర్పడిందని చదువుతుంటే చాలా వింతగా, మనసంతా ఏదో బరువుగా అనిపిస్తోంది అని విజయ్ తన నోట్‌లో పేర్కొన్నారు.నాటి ఆ రోజు, ఆ తర్వాత నా జీవితంలో జరిగిన ప్రతిదాని కంటే ఒక కుర్రాడిగా నాకు ఎంతో అత్యంత ముఖ్యమైనది. అది స్వేచ్ఛగా, తిరుగుబాటు మనస్తత్వంతో ఉండే ఒక చిన్న కుర్రాడికి గొప్ప గుర్తింపును, బలాన్ని ఇచ్చింది. కలలు కనడం లేదా వాటిని నమ్మడం తప్పు కాదని నిరూపించింది. నా తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ అందరికంటే ఎక్కువగా తరుణ్ భాస్కర్.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను భయ్యా.. నిన్ను ఎంతో ఇష్టపడతాను. నీతో కలిసి ఈ సినిమా చేసినందుకు ఎంతో గర్వంగా, ఆశీర్వదించబడినట్లుగా భావిస్తున్నాను. నువ్వు చాలా అరుదైన మంచి మనసున్న వ్యక్తివి” అని దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను కొనియాడారు. అలాగే జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్న ‘పెళ్లి చూపులు’ చిత్రానికి కష్టపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు.

