క్రీడా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

356
venkaiah naidu
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వివిధ క్రీడా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్ర క్రీడా మంత్రి శ్రీ కిరణ్ రిజిజును ఉపరాష్ట్రపతి శ్రీ ముపుప్పవరపు వెంకయ్యనాయుడు ఆదేశించారు. మంగళవారం ఉపరాష్ట్రపతి నివాసంలో క్రీడామంత్రి, ఆ శాఖ కార్యదర్శి రాధేశ్యాం జులానియాతో జరిగిన ఈ సమావేశంలో.. తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వివిధ క్రీడాప్రాంగణాలు నిర్మాణ దశల గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్, విశాఖపట్టణంలోని కొమ్మడి మిని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడాప్రాధికార కేంద్ర మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుతోపాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో క్రీడావసతులు తదితర అంశాలపై ఉపరాష్ట్రపతి వివరాలు అడిగారు.

దీనికి మంత్రి సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇండోర్ స్టేడియంలతోపాటు, ఇతర ప్రాజెక్టులకోసం నిధులు విడుదల చేశామని అయితే నిధుల వినియోగ వివరాలు (యూసీలు) రావడం ఆలస్యం అవుతున్నందున తదుపరి పనులు ఆలస్యం అవుతున్నాయని వెల్లడించారు. అయితే యూసీలను తెప్పించుకుని వీలైనంత త్వరగా మిగిలిన పనులను పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు. ఈ సమావేశం మధ్యలో ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసులుతోనూ ఉపరాష్ట్రపతి మాట్లాడి వివరాలు అడిగారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక వసతులున్నాయని అక్కడ జాతీయస్థాయి క్రీడలు నిర్వహించి సద్వినియోగపరుచుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దేశంలో క్రీడారంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఉపరాష్ట్రపతి అభినందించారు. అయితే క్రీడాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా చర్యలు చేపట్టాలని క్రీడామంత్రికి ఉపరాష్ట్రపతి సూచించారు. మానవ వనరుల అభివృద్ధి, పెట్రోలియం సహా పలు శాఖలు దేశంలో క్రీడాభివృద్ధికోసం క్రీడామంత్రిత్వ శాఖకు తమవంతు సహకారం అందించేలా చర్చలు జరపాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు. యూనివర్సిటీలు, కాలేజీలు కూడా క్రీడలను ప్రోత్సహించాలని ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

- Advertisement -