మేడారం గిరిజన కుంభమేళ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో భాగంగా వనదేవతలను దర్శించుకున్న వెంకయ్య ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దేవతలపై పసుపు,కుంకుమలు చల్లారు. అమ్మవార్లకు పట్టు వస్ర్తాలను సమర్పించారు. అంతకముందు ఆయన తులాభారం ఊగారు. వన దేవతలకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించారు.
అనంతరం మాట్లాడిన వెంకయ్య…మేడారం జాతరకు ప్రభుత్వం తీసుకున్న ఏర్పాట్లు భేష్ అని కొనియాడారు. జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. తమ సంప్రదాయ దుస్తులతో ప్రజలు వనదేవతలను స్మరించుకోవడం అద్బుతమన్నారు.
జాతరలు,పండగలు మన పూర్వికులను గుర్తించుకోవడం, మంచి మార్గంలో ముందుకెళ్లేందుకు తోడ్పడతాయన్నారు. సాధారణ పౌరుడిగా కొన్ని సంవత్సరాల కింద మేడారం వచ్చానని…ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. మేడారం విశ్వవ్యాప్తం కావాలన్నారు.వనదేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు.