కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి..

112
venkaiah-naidu

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా సంక్రమణకు గురైన వారికి ఇతర వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు. అయితే వైద్యుల సూచన మేరకు ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు. సోమవారం ఎయిమ్స్ వైద్యుల బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిగా ఉపరాష్ట్రపతి తెలియజేశారు.

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయితే వైద్యుల సూచనలను మరికొంత కాలం పాటు కొనసాగించడం మంచిదని, ఇంటి నుంచే జాగ్రత్తలు పాటిస్తూ, పని చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.స్వీయ నిర్బంధ కాలంలో తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేసిన ప్రజలకు, ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా ఆయన కోలుకోవాలని ఆకాంక్షించి, ప్రార్థనలు నిర్వహించిన వారందరి ప్రేమాభిమానాలకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.

కరోనా సోకిన కాలంలో ఆయనకు ఆరోగ్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన తమ వ్యక్తిగత సహాయకులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.