లాక్ డౌన్ సందర్భంగా రైతులు, వ్యవసాయరంగానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయ పనుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చొరవతీసుకోవాలని సూచించారు. బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమరHతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.అన్నదాతలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు.
‘చాలా సందర్భాల్లో వినియోగదారుల గురించి ఆలోచించినంతగా..అన్నదాతల ఆలోచనలు, ఇబ్బందుల గురించి సమాజం, మీడియా, ప్రభుత్వాలు ఆలోచించవనే విమర్శ వినబడుతోంది.కానీ రైతుల ఇబ్బందులను పరిష్కరించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. రాష్ట్రాలు దీనిపై చొరవతీసుకోవాలి. కేంద్రం సమయానుగుణంగా రాష్ట్రాలకు ఈ విషయంలో సూచనలు చేస్తుండాలి’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. పళ్లు, కూరగాయల వంటి వాటిపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని.. వీటిని భద్రపరిచడం, రవాణా అవకాశాలు పెంచడం, మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు.
రైతులు మార్కెట్ కు వెళ్లి వారి ఉత్పత్తులను విక్రయించడం కంటే.. ఏపీఎంసీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి నేరుగా రైతుల వద్దకే వెళ్లి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశం, వీటిని రాష్ట్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. తద్వారా వినియోగదారులకు కూడా సరిపోయేంతగా పళ్లు, కూరగాయలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేందుకు వీలవుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సుగమం చేసేలా అధికారులు చొరవతీసుకోవాలని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుత పంటకోతల సమయాన్ని గుర్తుచేస్తూ.. వ్యవసాయ యంత్రాలు, ఇతర పరికరాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచడంపై దృష్టిపెట్టాలన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను కేంద్ర వ్యవసాయ మంత్రి.. సవివరంగా ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని శ్రీ తోమర్ వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో రైతులకు సహాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా హామీ ఇచ్చారు.