ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తిరుమల శ్రీవారి దర్శినానికి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన వెంకయ్య మీడియాతో మాట్లాడారు.
ఉపరాష్ట్రపతిగా ఎంపికవడం ఆయనకు జీవితంలో దక్కిన అత్యంత అదృష్టమని వ్యాఖ్యానించారు. మరో నాలుగు రోజుల్లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నానని, ఆ నేపథ్యంలోనే స్వామివారి దర్శనం చేసుకోవాలని కుటుంబ సభ్యులతో కలసి వచ్చానని పేర్కొన్నారు.
అంతేకాకుండా…రాజ్యాంగ విలువలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కూడా ఆయన అన్నారు. కాగా..తిరుమలకు వచ్చిన వెంకయ్యకు టీటీడీ అధికారులు ఆలయ సంప్రదాయం మేరకు దర్శనానికి ఏర్పాటు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందించారు.
ఇక ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికయ్యారు.