న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో ఈరోజు రాత్రి 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ జనవరి మొదటి వారం మొత్తం కొనసాగుతుందని ప్రకటించారు.
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేయడం, అవసరమైతే జైలు శిక్ష విధించడం, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ సృష్టించే వారిపైనా కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఏమాత్రం వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
మద్యం సేవించిన వారు తప్పనిసరిగా వాహనం నడపకుండా క్యాబ్‌లు లేదా ఆటోలను ఆశ్రయించాలని సూచించారు. ఇది తమ భద్రతకే కాకుండా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమని చెప్పారు.
కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సురక్షితంగా, క్షేమంగా జరుపుకోవాలని సీపీ సజ్జనార్ నగరవాసులను కోరారు. పోలీసులకు సహకరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్!

